Post your question

 

    Asked By: రమేష్‌

    Ans:

    పరాయి భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిర్బంధం లేకుండా అనువాదాల ద్వారా జ్ఞాన సముపార్జన చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగానికి ప్రాముఖ్యం పెరుగుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యంతో మెషిన్‌ లెర్నింగ్‌ పద్ధతులతో యంత్ర అనువాద వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు, పరిశోధకులు, విలేఖరులు, అధికారులు, సమాచార కేంద్రాలు, వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు, సినిమా, బుల్లితెర వ్యవస్థల రంగాల్లో అనువాద వ్యవస్థలను వాడటం సాధారణం అవుతోంది. పైన చెప్పిన అన్ని రంగాల్లో అనువాదకుల అవసరం ఉంటుంది. జాతీయ విద్యావిధానం - 2020 నిబంధనల ప్రకారం ఉన్నత విద్యను కూడా మాతృభాషలో చదివే అవకాశం ఉంది. ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో ఉన్న పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి చాలామంది అనువాదకులు అవసరం అవుతారు. ఈ రంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తే హిందీ, ప్రాంతీయ, విదేశీ భాషానువాదకులుగా, ప్రూఫ్‌ రీడర్లుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, రాయబార కార్యాలయాల్లో, డిఫెన్స్‌ పరిశోధన సంస్థల్లో, వాణిజ్య ప్రకటనల సంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి బహుళ జాతి సంస్థల్లో, మొబైల్‌ ఫోన్‌ కంపెనీల్లో అనువాదకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఇటీవలి కాలంలో మెడికల్‌ కోడింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతూ ఉంది. కొవిడ్‌ తరువాత మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. దీనిలో శిక్షణ పొందినవారికి బీపీఓల్లో, హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. డెంటల్‌ కోర్సు చదివినవారికి కూడా ఈ రంగంలో మెరుగైన కెరియర్‌ ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలో చాలా మెడికల్‌ కోడింగ్‌ శిక్షణ సంస్థలు ఉన్నాయి. మీ అవగాహన కోసం కొన్ని సంస్థల పేర్లు.. హైదరాబాద్‌లో- హెన్రీ హర్విన్, మెడేసన్, రెసాల్వ్‌ మెడికోడ్, ఐక్యా గ్లోబల్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌కోడ్‌ సొల్యూషన్స్, ఇన్ఫోమెటిజ్, జోషి మేడికోడ్, గ్లోబల్‌ మెడికోడ్, క్లినిజెన్, మెడికాన్‌. విజయవాడలో- ఎస్‌ఆర్‌ టెక్నాలజీస్, టెక్నోస్పార్క్,  డెస్టినెక్స్ట్, ఎస్‌కేఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌. వీటిలో చేరే ముందు సంస్థల విశ్వసనీయత గురించి తెలుసుకొని, నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్న నగరాల్లో శిక్షణ పొందితే, త్వరగా ఉద్యోగం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    వీడియో గేమ్స్‌ అంటే ఇష్టం వేరు, వాటికి సంబంధించిన కోర్సులు చదవడం వేరు. చాలా సందర్భాల్లో ఒక వయసు వచ్చాక పిల్లల్లో వీడియో గేమ్స్‌ మీద ఆసక్తి తగ్గి, అందుకు సంబంధించిన కోర్సులపై ఇష్టం తగ్గే ప్రమాదం ఉంది. మీ అబ్బాయిని వీడియో గేమ్స్‌/ యానిమేషన్‌ లాంటి కోర్సుల్లో చేర్పించేముందు, ఆ రంగంలో రాణించాలంటే ఎంత ఓపిక ఉండాలో, ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలో, ఎలాంటి నైపుణ్యాలు అవసరమో చెప్పే ప్రయత్నం చేయండి. యానిమేషన్‌ రంగంలో ప్రవేశించాలంటే డ్రాయింగ్‌పై ఆసక్తి, టెక్నాలజీపై కొంత  అవగాహన, సృజనాత్మకత అవసరం. ఇలాంటి కోర్సుల్లో డ్రాయింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్, వీడియో గేమ్‌లను ఎలా తయారుచేయాలో నేర్పుతారు. యానిమేషన్‌కు సంబంధించిన ప్రోగ్రాంలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌- అహ్మదాబాద్, ఐడీసీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ ఐఐటీ- బాంబే, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌- కోల్‌కతా, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అమిటీ యూనివర్సిటీ, పీఏ ఇనాందార్‌ కాలేజ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్, డిజైన్‌ అండ్‌ ఆర్ట్‌- పుణె,   ఇండియన్‌ ఇన్‌స్ట్టిస్టూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ యానిమేషన్‌- బెంగళూరు, ఆసియన్‌  అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌- నోయిడా, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్‌ డిజైన్‌- పుణె, సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌- కోల్‌కతా అందిస్తున్నాయి. వీడియో గేమింగ్‌కు సంబంధించిన కోర్సులు చాలా ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకుని మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: జి.హరి

    Ans:

    బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్స్‌ ప్రకారం ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రాంను ఈవెనింగ్‌ కాలేజీ/ దూరవిద్య/ పార్ట్‌ టైం ద్వారా చదవడం కుదరదు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ చదవాలన్న కోరిక బలంగా ఉంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి విరామాన్ని ఇవ్వండి. లాసెట్‌లో మెరుగైన ర్యాంకు పొంది రెగ్యులర్‌గానే చదవండి. కొంతమంది ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే రెగ్యులర్‌గా ఎల్‌ఎల్‌బీ చదివే ప్రయత్నం చేస్తున్నారు. అలా పొందిన ఎల్‌ఎల్‌బీ డిగ్రీతో ఉపాధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.భాను

    Ans:

    ప్రస్తుతం ఉన్న ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీతో పాటు అదనంగా పొందిన నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఏదైనా డిగ్రీ చదువుతూ, ఆ డిగ్రీకి సంబంధించిన ఇతర కోర్సులు నేర్చుకోవడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్‌లో శిక్షణ పొందడం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఎథికల్‌ హ్యాకింగ్‌పై పట్టున్నవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆ కోర్సులో శిక్షణ పొందినవారికి డిమాండ్‌ ఉంది. కానీ మీరు రెగ్యులర్‌గా చదవబోయే ఎంసీఏను అశ్రద్ధ చేయకూడదు. రెండింటినీ సమన్వయం చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అదే సమయంలో హ్యాకింగ్‌లో మెలకువలను కూడా నేర్చుకొని, అందులో సర్టిఫికేషన్‌ పొందితే పేరున్న సంస్థలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: నితీష్‌ రెడ్డి

    Ans:

    బీఎస్సీలో మీరు చదువుతున్న మూడు సబ్జెక్టులకూ మంచి భవిష్యత్తు  ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవడానికి బయోటెక్నాలజీ, బయో ఫార్మాస్యూటికల్‌ రిసెర్చ్, ఫుడ్‌ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్సెస్, క్లినికల్‌ రిసెర్చ్, జెనెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, సెల్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, కంప్యుటేషనల్‌ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్‌ కేర్, జీనోమిక్స్, పబ్లిక్‌ హెల్త్, బయో స్టాటిస్టిక్స్, వైరాలజీ, బయో ఎథిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు చేయొచ్చు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే మెడికల్‌ కోడింగ్‌ ఉద్యోగాల వృద్ధి రేటు కొంత మెరుగ్గానే ఉండటం వల్ల ఆ రంగంలో అవకాశాలు ఎక్కువ. కానీ కొంతకాలానికి మీరు చేస్తున్న ఉద్యోగంలో వైవిధ్యం లేదని ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది పూర్తిగా మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కోర్సును ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌